*విజేతల గర్జన – విజయ రహస్యాలు*

*విజేతల గర్జన – విజయ రహస్యాలు*
"విజేతలకు భవిష్యత్తు ఉంటుంది... ఎందుకంటే వారే ఆ భవిష్యత్తును స్వయంగా ప్రణాళిక చేసుకుంటారు!"
చరిత్ర సృష్టించాలన్నా, భవిష్యత్తును శాసించాలన్నా కాలాన్ని గుప్పిట్లో పట్టాలి. ప్రణాళిక కోసం వెచ్చించే ప్రతి నిమిషమూ, ఆచరణలో పెట్టే ప్రతి క్షణమూ కాలాన్ని మనకోసం ఆదా చేస్తుంది. ఆ దాచుకున్న సమయాన్నే విజేతలు తమ విజయ సోపానాలుగా మలచుకుంటారు!
మహామేధావి థామస్ ఎడిసన్ అన్నట్లు... అంబోతు లాంటి కష్టమైన పని ఆలోచించడమే! అందుకే మెజారిటీ జనం ఈ ఆలోచనా శక్తికి భయపడి పారిపోవాలని చూస్తారు. కానీ విజేతలు అలా కాదు. వారు తమ మానసిక శక్తులను తవ్విపోస్తూ, పరాజయాల ఛాతిపై జయకేతనం ఎగరేస్తారు. ఆలోచించే కొద్దీ ఏ కఠినమైన ప్రక్రియ అయినా దారికొస్తుంది, తేలికగా మారుతుంది!
లోకం పోకడ చూడండి... షాపింగ్‌లలో, వస్తువులు కొనుగోళ్లలో యాంత్రికంగా ఆలోచించి సమయాన్ని వృధా చేసేవారే కోకొల్లలు. నిమిషం ప్రయోజనం లేని చోట విపరీతంగా ఆలోచిస్తారు. కానీ జీవితాన్ని మలుపు తిప్పే బృహత్తర నిర్ణయాలు మాత్రం నిమిషంలో తీసేయాలి! జ్ఞాని ఫ్రాన్సిస్ బేకన్ గళం విప్పి చెప్పిన సత్యం ఇదే—ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలు, జీవిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కనీసం 72 గంటల విరామం ఇవ్వండి, పరిణతితో ఆలోచించండి! ఒకవేళ అలా ఆలోచించలేకపోతే, ఆ నిర్ణయానికి విలువే లేదు.
జీవితంలో కష్టాలు, ఆటంకాలు, చికాకులు తుఫానులా ముంచుకొచ్చినప్పుడు కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. ఏ భావోద్వేగాలకు లోనుకాకుండా, నిర్మలంగా ఆ సమస్యను తొలిసారి చూసినట్లయితే... అద్భుతమైన పరిష్కార మార్గం దానంతట అదే ప్రత్యక్షమవుతుంది! మీ విజయ బాధ్యతలను మీ భుజస్కంధాలపై మోయండి; అప్పుడే మీ వ్యక్తిత్వం ఉక్కులా రూపుదిద్దుకుంటుంది.
ఇక్కడ గమనించాల్సిన పరమ సత్యం ఒక్కటే:
నిరాశావాదులు, పరాజితులు చేయడానికి ఇష్టపడని పనులనే విజేతలు అలవాటుగా మల్చుకుంటారు!
"ఇది చేసి తీరాలన్న కోరిక వారికి ఏమీ ఉండదు... కానీ సాధించాల్సిన ప్రయోజనం ఎంత అవసరమైందంటే, వారి అయిష్టం ఇట్టే అప్రధానం అయిపోతుంది!
తప్పులను సరిదిద్దుకునే నిరంతర అలవాటే విజయవంతమైన జీవనశైలికి పునాది. పరాజయాలను తుత్తునియలు చేస్తూ, ముందుకు సాగిపోవడమే అసలైన విజేత లక్షణం!

Dr.Rambabu Ankam 

Comments

Popular posts from this blog

పిల్లల పెంపకంలో 'నీటి' తత్వం: బ్రూస్ లీ చెప్పిన అద్భుతమైన పాఠం

ఉప్పు సత్యాగ్రహానికి గాంధీజీ; నెయ్యి సత్యాగ్రహానికి పవన్ కళ్యాణ్ జీ

మాతృభాష: మన అస్తిత్వం - మన గౌరవం