జీవితం అనేది ఒక సినిమా అనుకుంటే... అందులో హీరో ఎవరు అన్నది ముఖ్యం కాదు, ఆ పాత్రకు ఎంత న్యాయం చేశారన్నదే ముఖ్యం.
"జీవితం అనేది ఒక సినిమా అనుకుంటే... అందులో హీరో ఎవరు అన్నది ముఖ్యం కాదు, ఆ పాత్రకు ఎంత న్యాయం చేశారన్నదే ముఖ్యం. తెలుగు సినిమా తెర మీద ఒకడు వచ్చి నిలబడ్డాడు... ఎలాంటి గొడుగు లేదు, వెనక బలం లేదు, కేవలం కళ్లల్లో పట్టుదల, గుండెల్లో ఇష్టం తప్ప మరో మూలధనం లేదు!
ఎవడ్రా వీడు? ఎక్కడి నుంచి వచ్చాడు? అని అనుకున్న వాళ్ళే ఆశ్చర్యపోయేలా... ఆ చైత్ర రథాన్ని తన కష్టంతో పరుగెత్తించాడు చిరంజీవి! ఒకడు ఎదిగితే అందరూ చూస్తారు, కానీ అట్టడుగు నుంచి వచ్చి, అడుగడుగునా అవమానాలను మెట్లుగా మార్చుకుంటూ శిఖరం మీద కూర్చుంటే... దాన్ని 'శ్రమ' అంటారు. ఆ శ్రమకు నిలువెత్తు రూపమే ఆయన.
తెలుగు నేల మీద 'మెగాస్టార్' అంటే కేవలం ఒక పేరు కాదు... అది అలుపెరగని ఒక ప్రయాణం! కెరీర్ మొదట్లో దెబ్బలు తగిలాయి, ఫ్లాపులు పలకరించాయి. కానీ ఆయన ఒక్క క్షణమైనా వెనక్కి తగ్గలేదు. 'పరాజయం అనేది ఒక చిన్న విరామం మాత్రమే, అంతిమ విజయం నాదే' అని తన నటనతో, పట్టుదలతో నిరూపించి చూపించాడు.
ఇక పొగరుతో కాకుండా, ఒదిగి ఉండే వినయంతో ఇండస్ట్రీని ఏలవచ్చని ఆయన చేసి చూపించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా, ఆరంభంలో తనతో నడిచిన వాళ్ళను, తనను నమ్మిన వాళ్ళను గుండెల్లో పెట్టుకోవడం ఎవరికైనా సాధ్యం అవుతుందా? రాజకీయాల్లోకి వెళ్లారు, విమర్శల వర్షాలు కురిశాయి. అయినా సరే... 'నా వాళ్లకు మంచి జరగాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఒక అద్భుతమైన స్థానం దక్కాలి' అనే నిస్వార్థ ధ్యేయంతో, ఒక యోధుడిలా నడిచి... చివరకు అందరికీ మంచి చేసి, ఎలాంటి ఆశలూ లేక గౌరవంగా పక్కకు తప్పుకున్న ఆ పెద్దరికం ఉందే... అది అందరికీ రాదు!
సమాజం నుంచి తీసుకున్నది ఏదో ఒక రూపంలో సమాజానికే తిరిగివ్వాలనే తపనతో 'బ్లడ్ బ్యాంక్' నడిపారు. రియల్ లైఫ్‌లోనూ తానేంటో చాటిచెప్పారు.
యువతకు ఆయన చెప్పే మాట ఒక్కటే:
జీవితంలో ఎవరి సాయం కోసం ఎదురుచూడకండి. మీ శ్రమే మీ ఆయుధం కావాలి. వచ్చే ప్రతీ వైఫల్యాన్ని ఒక గుణపాఠంగా మార్చుకోండి. కింద ఉన్నప్పుడు వినయం, పైన ఉన్నప్పుడు బాధ్యత... ఈ రెండూ ఉంటే నువ్వే ఈ తరానికి అసలైన హీరో! ఏ రంగంలోనైనా సరే, ముద్ర వేయడం అంటే చిరంజీవిలా బ్రతకడమే!"
Dr.Rambabu Ankam



Comments
Post a Comment