*అమ్మమ్మ, నాన్నమ్మల ఇంటికి వెళ్లేముందు పిల్లలకు ఇవి నేర్పండి: ప్రముఖ పేరెంటింగ్ కోచ్ గుర్ ప్రీత్ కౌర్ సూచనలు!*
*అమ్మమ్మ, నాన్నమ్మల ఇంటికి వెళ్లేముందు పిల్లలకు ఇవి నేర్పండి: ప్రముఖ పేరెంటింగ్ కోచ్ గుర్ ప్రీత్ కౌర్ సూచనలు!*
బాల్యంలో ప్రతి ఒక్కరికీ గుర్తిండిపోయే అత్యంత మధురమైన జ్ఞాపకం... అమ్మమ్మ లేదా నాన్నమ్మ ఇల్లు. వేసవి సెలవులు వచ్చాయంటే చాలు, పిల్లల మనసంతా ఆత్మీయతల ఊరిపైనే ఉంటుంది. అక్కడ దొరికే అప్యాప్యత, అమాయకపు అల్లరి, కమ్మని వంటలు పిల్లలను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. అయితే, ఈ పర్యటన కేవలం ఆటపాటలకే పరిమితం కాకుండా, పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ఒక చక్కని అవకాశంగా మార్చుకోవచ్చు.
అమ్మమ్మ, నాన్నమ్మల ఇంటికి వెళ్లేముందు తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాల్సిన ఐదు ముఖ్యమైన పాఠాలు ఏమిటో ప్రముఖ పేరెంటింగ్ కోచ్ గుర్ ప్రీత్ కౌర్ వివరిస్తున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
1. ‘హక్కు’ కాదు... ‘కృతజ్ఞత’ ముఖ్యం
అమ్మమ్మ లేదా నాన్నమ్మ ఇల్లు అనగానే పిల్లలు తమకు సర్వహక్కులూ ఉన్నాయన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. అక్కడ లభించే ప్రేమాభిమానాలను, వారు చేసే సేవలను ‘తమ హక్కు’గా భావించకుండా, ఎంతో ‘కృతజ్ఞత’తో స్వీకరించడం నేర్పాలి. వయసు పైబడిన ఆ వృద్ధులు తమ అలసటను సైతం లెక్కచేయకుండా మన కోసం శ్రమిస్తున్నారనే భావన పిల్లల మనసులో నాటుకునేలా చేయాలి.
2. డిజిటల్ ప్రపంచానికి దూరం.. ఆత్మీయతలకు లంకె!
ప్రస్తుత కాలంలో పిల్లలు ఎక్కడికి వెళ్లినా ఫోన్లు, ట్యాబ్‌లతోనే కాలక్షేపం చేస్తున్నారు. పెద్దల ఇంటికి వెళ్లినప్పుడైనా ఈ అలవాటుకు కాస్త బ్రేక్ వేయాలి. రోజులో కనీసం కొంత సమయమైనా ఎలాంటి గాడ్జెట్స్ లేకుండా అమ్మమ్మ, తాతయ్యలతో కూర్చొని మాట్లాడటం నేర్పించాలి. వారు చెప్పే పాతకాలపు ముచ్చట్లు, అనుభవాలు, కథలను వినడం వల్ల పిల్లల్లో ఆలోచనా దృక్పథం పెరుగుతుంది.
గుర్ ప్రీత్ కౌర్ సూచన: కనీసం భోజనం చేసేటప్పుడైనా ఫోన్లను పక్కన పెట్టి, కుటుంబ సభ్యులందరితో కలిసి సరదాగా మాట్లాడేలా అలవాటు చేయండి.
3. మనస్ఫూర్తిగా ‘ధన్యవాదాలు’ చెప్పడం
అమ్మమ్మో, మావయ్యో ప్రేమతో ఏదైనా బహుమతి ఇచ్చినప్పుడు లేదా వారికి నచ్చిన వంటకం చేసి పెట్టినప్పుడు... పిల్లలు తాము చేస్తున్న పనిని ఆపి, వారి కళ్లల్లోకల్లా చూస్తూ చేతులు చాచి అందుకోవాలి. కేవలం పైపైన ‘థాంక్స్’ అని కాకుండా, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం నేర్పించాలి. ఆ చిన్న బహుమతి వెనుక వారి శ్రమ, సమయం, అంతకంటే మిన్నగా ‘ప్రేమ’ దాగి ఉన్నాయనే విషయాన్ని పిల్లలు గ్రహించేలా చేయాలి.
4. వ్యక్తిగత వీడ్కోలు.. బంధాలకు నిలువుటద్దం!
సెలవులు ముగిసి తిరిగి ఇంటికి ప్రయాణమయ్యేటప్పుడు, అందరికీ కలిపి ఒకేసారి ‘బై’ చెప్పేసి కారు ఎక్కేయడం సరికాదు. ఇంట్లోని ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి విడివిడిగా వీడ్కోలు చెప్పడం (Personal Goodbye) అలవాటు చేయాలి. ‘ఈ కొన్ని రోజులు మీతో గడపడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది’ అని పిల్లలు స్వయంగా వారితో చెప్పాలి. వీలైతే, ఈ పర్యటనలో తమకు బాగా నచ్చిన ఒక విషయాన్ని వారితో పంచుకోమనాలి. ఇది బంధాలను మరింత బలోపేతం చేస్తుంది.
5. అనుబంధాలను గౌరవించడం
సెలవుల్లో ఆడుకున్న ఆటలు, చేసిన అల్లరి తాత్కాలికమే కావచ్చు. కానీ, అక్కడ పెద్దల సమక్షంలో నేర్చుకున్న క్రమశిక్షణ, ప్రశాంతత జీవితాంతం తోడుంటాయి. మన జీవితంలో అత్యంత విలువైన మనుషులు వారేనని, వారి పట్ల ఎల్లప్పుడూ గౌరవాన్ని కలిగి ఉండటమే నిజమైన సంస్కారమని పిల్లలకు వివరించాలి.
ముగింపు:
అమ్మమ్మ, నాన్నమ్మల ఇల్లు కేవలం ఒక విడిది కేంద్రం కాదు; అదొక సంస్కారాల బడి. ఈ సెలవుల్లో మీ పిల్లలకు గుర్ ప్రీత్ కౌర్ సూచించిన ఈ ఐదు పాఠాలను నేర్పించి చూడండి... వారు కేవలం జ్ఞాపకాలను మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుంచుకునే మంచి విలువలను కూడా మూటగట్టుకుని వస్తారు!
Dr.Rambabu Ankam.
Comments
Post a Comment