ఉగాది పచ్చడి: ఆరు రుచుల ప్రసాదమా? లేక రేపటి తరానికి 'పేరెంటింగ్' పాఠమా?
శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ |
సర్వారిష్టవినాశాయ నింబకందళభక్షణం ||
ఉగాది పచ్చడి: ఆరు రుచుల ప్రసాదమా? లేక రేపటి తరానికి 'పేరెంటింగ్' పాఠమా?
తెలుగువారికి ఉగాది అంటే కేవలం కాలెండర్ మార్చుకోవడం కాదు, జీవిత గమనాన్ని సరిచూసుకోవడం. ప్రకృతి చిగురించే వేళ, మన ఆలోచనలు కూడా కొత్త చిగుళ్ళు వేయాలి. అందుకే మన పెద్దలు ఈ పండుగను ఒక అద్భుతమైన శ్లోకంతో ప్రారంభిస్తారు:
రోకటి పోటులో నలిగిన వేదాంతం: ఆరు రుచులు - ఆరు పాఠాలు
అమ్మ రోట్లో పచ్చడి నూరుతుంటే, అందులో కేవలం పదార్థాలు పడవు.. ఒక బిడ్డ జీవితానికి అవసరమైన విలువల పాఠాలు పడతాయి.
1. వేపపువ్వు (చేదు): ఓటమిని ఓర్చుకునే శక్తి.
నేటి పిల్లలకు మనం 'చేదు'ని పరిచయం చేయడం లేదు. కానీ, పచ్చడిలో వేపపువ్వు కడుపులోని క్రిములను చంపినట్టే, జీవితంలో వచ్చే ఓటమి మనిషిలోని అహంకారాన్ని చంపి, నిజాన్ని చూపిస్తుంది. విమర్శలను తట్టుకోగలిగేలా బిడ్డను పెంచడమే అసలైన విజయం.
2. బెల్లం (తీపి): విజయ గర్వం లేని వినయం.
తీపి అందరికీ ఇష్టమే. కానీ బెల్లం ప్రత్యేకత ఏమిటంటే, అది తాను తీపినిస్తూనే మిగిలిన ఐదు రుచులను కలుపుతుంది. పిల్లలు విజయాలు సాధించినప్పుడు గర్వపడకుండా, అందరినీ కలుపుకుపోయే వినయాన్ని అలవర్చుకోవాలని ఈ తీపి చెబుతుంది.
3. పచ్చి మామిడి (వొగరు): కొత్త సవాళ్ల పట్ల సాహసం.
వొగరు అనేది ఒక కొత్త అనుభూతి. జీవితంలో కొత్త బాధ్యతలు చేపట్టినప్పుడు ఉండే ఆందోళనే ఈ వొగరు. ఆ తెలియని భయాన్ని చూసి వెనకడుగు వేయకుండా, ముందుకు సాగే సాహసాన్ని పిల్లలకు నేర్పాలి.
4. చింతపండు (పులుపు): విచక్షణతో కూడిన నేర్పు.
చింతపండు పులుపు ఎక్కువైతే పచ్చడి పాడవుతుంది. అలాగే, పిల్లలకు ఇచ్చే స్వేచ్ఛ కూడా పరిధిలో ఉండాలి. ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించుకోగలిగే విచక్షణ (Discretion) పిల్లల్లో పెంచడమే తల్లిదండ్రుల బాధ్యత.
5. మిర్చి/మిరియాలు (కారం): అన్యాయంపై ఆవేశం.
కారం నాలుకకు చురుకు పుట్టిస్తుంది. బిడ్డ ఎప్పుడూ అమాయకుడిగా పడి ఉండకూడదు. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే చైతన్యం, ఆత్మాభిమానాన్ని కాపాడుకునే ఆవేశం వాడిలో ఉండాలి.
6. ఉప్పు: బ్రతుకులో సమతుల్యం.
ఉప్పు లేని కూర ఎలాగో, క్రమశిక్షణ లేని పెంపకం అలానే. జీవితంలో ఎన్ని రుచులున్నా, వాటన్నింటినీ బ్యాలెన్స్ చేసేది ఉప్పే. కష్టసుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞత (Balance) బిడ్డకు నేర్పాలి.
ముగింపు:
"కాలం మారడం అంటే తేదీ మారడం కాదు.. మన పెంపకంలో విలువల వేగం పెరగడం!"
ఈ ఉగాదికి మనం మన పిల్లలకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఐఫోన్లో, గాడ్జెట్లో కాదు.. జీవితంలోని ఆరు రుచులను సమానంగా స్వీకరించే ధైర్యం. ఏ కష్టం వచ్చినా కుంగిపోకుండా, ఏ సుఖం వచ్చినా పొంగిపోకుండా ఉండటమే అసలైన ఉగాది పరమార్థం.
ప్రకృతి నేర్పే ఈ పాఠాన్ని మన ఇంటి పునాదుల్లో నింపుదాం.
అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
Dr.Rambabu Ankam.


Comments
Post a Comment