పిల్లల పెంపకంలో 'ఖగోళ' విప్లవం:
*బిడ్డ 'సూర్యుడు'.. అహానికి బందీ అయ్యే 'ఉపగ్రహం' కాదు!*
ఒకప్పుడు మానవుడు అజ్ఞానంతో "భూమే విశ్వానికి కేంద్రం, అన్నీ నా చుట్టూనే తిరగాలి" అనుకున్నాడు. దీనిని 'భూకేంద్రక సిద్ధాంతం' అన్నారు. కానీ విజ్ఞానం పెరిగాక తెలిసింది.. కేంద్రంలో ఉన్నది భూమి కాదు, వెలుగునిచ్చే 'సూర్యుడు' అని. దురదృష్టవశాత్తూ, నేటికీ చాలా ఇళ్లలో పిల్లల పెంపకం ఆ పాత అజ్ఞానంలోనే మగ్గిపోతోంది. తల్లిదండ్రుల అహం కేంద్రంగా, పిల్లల కలలు బందీలుగా మారుతున్నాయి.
అహం అనే 'నిశ్శబ్ద కారాగారం'
గత కొన్ని దశాబ్దాలుగా పెంపకం 'పేరెంట్-సెంట్రిక్'గా సాగుతోంది. భూమి ఎలాగైతే స్వయంప్రకాశం లేని తటస్థ గ్రహమో, ఇక్కడ తల్లిదండ్రుల అహం కూడా అలాగే ఉంటుంది. "నేను చెప్పిందే వేదం", "నా సామాజిక హోదా కోసం నువ్వు ర్యాంకులు తేవాలి" అనే ధోరణి బిడ్డపై భారాన్ని పెంచుతోంది. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడనే భ్రమలాగే, బిడ్డ తన ఇష్టంతో కాక తల్లిదండ్రుల ఒత్తిడితో బతుకుతున్నాడనే విషాదం ఇక్కడ ఉంది. ఇలా పెరిగే పిల్లలు ఆత్మవిశ్వాసం లేని 'ఉపగ్రహాలు'గా మిగిలిపోతారు.
అనురాగం అనే 'సూర్యకేంద్రం'
భౌతిక శాస్త్రంలో సూర్యుడు అంటే 'శక్తి వనరు'. ఆయన నిరంతరం వెలుగును, వెచ్చదనాన్ని ప్రసరిస్తూ మొత్తం సౌర కుటుంబ గమనానికి కారణమవుతాడు. ఆధునిక పెంపకంలో బిడ్డ 'సూర్యుడు' కావాలి. తల్లిదండ్రులు ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతూ వెలుగునిచ్చే రక్షక కవచాలుగా మారాలి.• నిరంతర ప్రేరణ: బిడ్డను ఒక విత్తనంలా భావించి, అది మహావృక్షం కావడానికి కావాల్సిన వాతావరణాన్ని అందించడమే మన బాధ్యత.
• మిత్రత్వం: వయసు పెరిగే కొద్దీ బిడ్డతో స్నేహితుడిలా వ్యవహరిస్తూ, వారికి నిర్ణయాధికారాన్ని ఇవ్వాలి. సూర్యుని వెలుగు వల్ల భూమిపై ప్రాణం పోసుకున్నట్లే, తల్లిదండ్రుల ప్రోత్సాహం అనే వెలుగు వల్ల బిడ్డ సమాజానికి ఉపయోగపడే గొప్ప నాయకుడిగా ఎదుగుతాడు.
'Pay-rent' నుండి 'Parent' వరకు..
మనం పిల్లల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం. కానీ అది కేవలం స్కూల్ ఫీజులు, సౌకర్యాల కోసం మాత్రమే అయితే మనం 'Pay-rent' (అద్దె కట్టేవారు) గానే మిగిలిపోతాం. బిడ్డకు ఐశ్వర్యం కంటే 'అమ్మ' స్పర్శ ముఖ్యం, ఆజ్ఞల కంటే 'నాన్న' ఇచ్చే భరోసా ముఖ్యం. సూర్యుడు గ్రహాల నుండి ఏమీ ఆశించడు, కేవలం వెలుగును ఇస్తూనే ఉంటాడు. నిజమైన తల్లిదండ్రులు కూడా బిడ్డ ఎదుగుదలలో తమ సార్థకతను వెతుక్కుంటారు తప్ప, తమ కలల భారాన్ని బిడ్డపై రుద్దరు.
కన్నీటితో ఒక విన్నపం!
విశ్వం భూమి చుట్టూ తిరగదు.. అలాగే మీ బిడ్డ భవిష్యత్తు కూడా మీ అహం చుట్టూ తిరగకూడదు. పెంపకంలో 'కేంద్రం' మారాలి. మీ అహం అనే భూమిని పక్కకు జరిపి, మీ బిడ్డలోని 'సూర్యుడిని' వెలగనివ్వండి.
రేపు ఆ బిడ్డ ప్రయోజకుడై లోకానికి వెలుగునిస్తుంటే.. "ఆ సూర్యుడిని నేను కన్నాను" అని గర్వంగా చెప్పుకునే రక్షక గ్రహంలా మీరు మిగిలిపోండి. ఆ తృప్తి ముందు స్వర్గం కూడా చిన్నదే! అప్పుడే ప్రతి ఇంట్లో ఒక సూర్యుడు ఉదయిస్తాడు.. ఆ వెలుగు ప్రపంచ భవిష్యత్తును ప్రకాశింపజేస్తుంది.
> "*నియంతృత్వం వద్దు.. మార్గదర్శకత్వం ముద్దు. అహం వీడి అనురాగంతో వెలుగునిద్దాం!*
ఈ విషయాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి!
Dr.Rambabu Ankam

Comments
Post a Comment