జెల్లీ ఫిష్ పేరెంటింగ్: వెన్నెముక లేని ప్రేమే పిల్లలకు శాపమా?
జెల్లీ ఫిష్ పేరెంటింగ్: వెన్నెముక లేని ప్రేమే పిల్లలకు శాపమా?
మనస్తత్వవేత్త డయానా బామ్రిండ్ దీనిని "పర్మిసివ్ పేరెంటింగ్" అని పిలిచారు
నేటి ఆధునిక సమాజంలో పెంపకం ఒక కొత్త మలుపు తిరిగింది. అది 'జెల్లీ ఫిష్ పేరెంటింగ్'. జెల్లీ ఫిష్‌కు వెన్నెముక ఎలా ఉండదో, ఈ పద్ధతిలో పిల్లల పట్ల కఠినమైన నియమాలు లేదా క్రమశిక్షణ అనే 'వెన్నెముక' ఉండదు. ప్రేమ పుష్కలంగా ఉన్నా, బాధ్యత నేర్పని ఈ పద్ధతిపై ఒక ప్రత్యేక విశ్లేషణ.
1. చారిత్రక నేపథ్యం: నిరంకుశత్వం నుండి నిస్సారత వైపు..
ఈ మార్పు వెనుక ఒక బలమైన చరిత్ర ఉంది.
• నాటి నిరంకుశత్వం :20వ శతాబ్దపు మధ్యకాలం వరకు పెంపకం చాలా కఠినంగా ఉండేది. "తల్లిదండ్రులు చెబితే వేదవాక్కు.. ఎదురు ప్రశ్న వేయకూడదు" అనే నియంతృత్వ ధోరణి ఉండేది.
• ప్రతిచర్య :ఆ కఠినమైన ఆంక్షలు, భయం మధ్య పెరిగిన నాటి పిల్లలే నేటి తల్లిదండ్రులు. తాము అనుభవించిన ఆ భయం, ఆంక్షలు తమ పిల్లలకు వద్దనుకుని, అటు నుండి ఇటు మరో విపరీత కోణానికి చేరుకున్నారు. ఫలితమే నేటి 'జెల్లీ ఫిష్' పద్ధతి.
2. సామాజిక మార్పులు: గిల్ట్ మరియు సింగిల్ చైల్డ్ కల్చర్
నేడు కుటుంబాలు చిన్నవయ్యాయి. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం వల్ల పిల్లలకు సమయం ఇవ్వలేకపోతున్నామనే 'అపరాధ భావం' పెరిగింది. ఆ గిల్ట్‌ను పోగొట్టుకోవడానికి, పిల్లలు అడిగినవన్నీ ఇవ్వడం, వారిని అసలు మందలించకపోవడం వంటివి చేస్తున్నారు. "పిల్లవాడు ఏడ్వకూడదు, వాడికి నచ్చింది వాడిని చేయనిద్దాం" అనే ఆలోచనే దీనికి మూలం.
3. వాస్తవిక ఉదాహరణలు:
• భారతీయ సందర్భం: మన చుట్టూ ఉన్న ఐటీ దంపతులను గమనిస్తే.. తమ ఏకైక సంతానం అల్లరి చేసినా, ఫోన్‌కు బానిసైనా మందలించరు. "రోజంతా ఆఫీసులో ఉంటాం, ఇంటికొచ్చాక వాడిని తిట్టి వాడికి దూరం కాలేం" అనే బలహీనతే జెల్లీ ఫిష్ పేరెంటింగ్.
• సినిమాటిక్ ఉదాహరణ: 'బొమ్మరిల్లు' చిత్రంలో సిద్ధార్థ్ తల్లి పాత్రను గమనిస్తే.. తండ్రి అతిగా నియంత్రించే 'హెలికాప్టర్' అయితే, తల్లి మాత్రం పిల్లలకు అతిగా స్వేచ్ఛనిస్తూ, తప్పు చేసినా మందలించలేని జెల్లీ ఫిష్ తరహాలో ఉంటుంది.
• అంతర్జాతీయ ఉదాహరణ: హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తన పిల్లలకు చిన్నప్పటి నుందే విపరీతమైన స్వేచ్ఛను ఇచ్చారు. ఫలితంగా వారు సృజనాత్మకంగా ఎదిగినా, సామాజిక నియమాల విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు.
4. పర్యవసానాలు: మెత్తని వ్యక్తిత్వం.. పెళుసైన భవిష్యత్తు
ప్రేమ దొరుకుతుంది కానీ, జీవిత సవాళ్లను ఎదుర్కొనే 'నిబ్బరం' దొరకదు. క్రమశిక్షణ లేని పెంపకం వల్ల పిల్లలు:
1. బయటి ప్రపంచపు చిన్నపాటి ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోతున్నారు.
2. ప్రతిదీ సులభంగా దొరుకుతుందనే భ్రమలో పెరిగి, ఏదైనా దక్కనప్పుడు కుంగిపోతున్నారు.
3. సరైన మార్గదర్శకత్వం లేక క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోలేక అయోమయానికి గురవుతున్నారు.
ముగింపు: స్వేచ్ఛకు 'దారం' ఉండాలి!
గాలిపటం ఆకాశంలో ఎత్తుకు ఎగరాలంటే దానికి 'దారం' అనే కట్టుబాటు ఉండాలి. ఆ దారమే గాలిపటం దారి తప్పకుండా చూసే భరోసా.
"పిల్లలకు ఆకాశమంత స్వేచ్ఛను ఇవ్వడం 'ప్రేమ' అయితే.. ఆ ఆకాశంలో వారు దారి తప్పకుండా చూసే దిక్సూచిగా మారడమే 'నిజమైన పెంపకం'."
తల్లిదండ్రులూ.. ప్రేమ అంటే పిల్లలు అడిగినవన్నీ చేయడం కాదు, రేపటి ప్రపంచాన్ని తట్టుకునేలా వారిని సిద్ధం చేయడం.
మీరేమంటారు?
మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి!
Dr.Rambabu Ankam

Comments
Post a Comment