హెలికాప్టర్ వద్దు.. లైట్‌హౌస్ అవ్వండి! పిల్లలను స్వతంత్రంగా ఎదగనివ్వండి.
"హెలికాప్టర్ వద్దు.. లైట్‌హౌస్ అవ్వండి! పిల్లలను స్వతంత్రంగా ఎదగనివ్వండి"
'బొమ్మరిల్లు' సినిమాలో సిద్ధార్థ్ చెప్పే డైలాగులు తల్లిదండ్రులు వినే ఉంటారు…
"నాకు ఏది ఇష్టమో.. ఏది కష్టమో.. నీకు ఎప్పుడూ అనవసరం నాన్నా! నీకు ఏది ఇష్టమో.. అదే నాకు ఇష్టం అనుకోవాలి నేను. నాకు నచ్చిన షర్టును కూడా నీకు నచ్చితేనే కొనిస్తావు.. దాన్ని నేను వేసుకున్నప్పుడు అది నీకు నచ్చినట్టు ఉందో లేదో అని చూసుకుంటావే తప్ప, నాకు కంఫర్టబుల్ గా ఉందా లేదా అని ఎప్పుడైనా ఆలోచించావా నాన్నా?"
"ప్రతి చిన్న విషయంలోనూ నీ నిర్ణయమే ఉండాలి. కనీసం ఐస్ క్రీం ఏ ఫ్లేవర్ తినాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావు. నా జీవితం నా చేతుల్లో లేదు నాన్నా.. నీ చేతుల్లో బొమ్మలా మారిపోయింది. నేను తప్పు చేస్తే సరిదిద్దు.. కానీ తప్పే చేయనివ్వకుండా నన్ను కట్టేయకు నాన్నా!"
ఇటువంటి మాటలు తూటాలు మిమ్మల్ని తాకకూడదు అనుకుంటే…..
ప్రేమ అనే పంజరం: మీ పిల్లల రెక్కలను మీరే కత్తిరిస్తున్నారా?
నేటి కాలంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపే అతి జాగ్రత్త వారి ఎదుగుదలకు 'రక్షణ కవచం' కాకుండా, వారి ఆత్మవిశ్వాసాన్ని ఉరితీసే 'సంకెళ్లు'గా మారుతోంది.
"*బిడ్డకు రక్షణ కవచమా? ఎదుగుదలకు సంకెళ్లా?* మీ పేరెంటింగ్ స్టైల్ ఏది?"
దీనినే మనస్తత్వ శాస్త్రంలో 'హెలికాప్టర్ పేరెంటింగ్' అంటారు.
పిల్లల ప్రతి అడుగును, ప్రతి నిర్ణయాన్ని గాలిలో తేలే హెలికాప్టర్ లాగా పైన ఉండి పర్యవేక్షించడమే ఈ విధానం. 1969లో డాక్టర్ హైమ్ గినా ట్ ఈ పదాన్ని తొలిసారిగా వాడారు. 80వ దశకంలో భద్రతా కారణాలతో మొదలైన ఈ ధోరణి, నేడు డిజిటల్ యుగంలో 'ట్రాకింగ్ యాప్స్' ద్వారా పిల్లలను ఇరవై నాలుగు గంటల నిఘాలో ఉంచే స్థాయికి చేరింది.
ముఖ్య లక్షణాలు: మీరు హెలికాప్టర్ పేరెంట్ అవునా?
• అతి పర్యవేక్షణ: హోంవర్క్ నుండి స్నేహితుల వరకు ప్రతి విషయంలోనూ సెకను సెకనుకు మీ జోక్యం ఉందా?
• నిర్ణయాధికారం మీదే: బట్టలు, చదువు, కెరీర్.. అన్నీ మీరే నిర్ణయిస్తున్నారా?
• వైఫల్యాల నుండి దూరం: బిడ్డ చిన్న ఓటమిని కూడా చూడకూడదని మీరు ముందే రంగంలోకి దిగి సమస్యను పరిష్కరిస్తున్నారా?
పిల్లల మనసుపై పడే ప్రతికూల ప్రభావాలు
ఒక అధ్యాపకుడిగా పేరెంటింగ్ మీద పుస్తకాల రచించిన రచయితగా
నేను గమనించిన చేదు నిజాలు ఇవే:
1. ఆత్మవిశ్వాస లోపం: "మా అమ్మ/నాన్న లేకపోతే నేను ఏమీ చేయలేను" అనే భావన వారిని బలహీనులను చేస్తుంది.
2. నిర్ణయాత్మక శక్తి శూన్యం: పెరిగిన తర్వాత కనీస నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వారు ఇతరులపై ఆధారపడతారు.
3. తీవ్రమైన ఒత్తిడి: నిరంతర నిఘా వల్ల పిల్లలు యాంగ్జైటీ డిప్రెషన్‌కు లోనవుతున్నారు.
4. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లోపించడం: జీవితంలో వచ్చే చిన్నపాటి కుదుపులకు కూడా వీరు కుప్పకూలిపోతారు.
పరిష్కారం: 'హెలికాప్టర్' నుండి 'లైట్‌హౌస్' వైపు..
తల్లిదండ్రులు హెలికాప్టర్ లాగా పైన తిరగడం మానేసి, లైట్‌హౌస్ లా మారాలి.
• తప్పులు చేయనివ్వండి: ఓటములే వారిని బలవంతులుగా మారుస్తాయి. చిన్న గాయాలైతేనే వారు రేపటి తుఫానులను తట్టుకోగలరు.
• బాధ్యతను అప్పగించండి: వారి వయసును బట్టి చిన్న చిన్న నిర్ణయాలను వారికే వదిలేయండి.
• నమ్మకాన్ని ఇవ్వండి: "నీ వెంట నేనున్నాను" అనే భరోసా ఇవ్వండి తప్ప, వారి పనులను మీరే చేయకండి.
"తల్లితండ్రులుగా ఇది గుర్తుంచుకోండి.. "
“మీరు మీ పిల్లల కోసం చేసే పనుల కంటే, వారిని తమ కోసం తాము ఏం చేసుకోవాలో నేర్పే పనులే వారిని గొప్పవారిని చేస్తాయి." పిల్లలు మీ ద్వారా ఈ లోకంలోకి వచ్చారు, కానీ వారు మీ ఆస్తి కాదు. వారికి సొంత ఆకాశం ఉంది, సొంత రెక్కలు ఉన్నాయి. వారికి రెక్కలు ఇవ్వడం అంటే వారు ఎగిరిపోతారని భయపడటం కాదు, వారు గమ్యాన్ని చేరుకుంటారని నమ్మడం. పిల్లల దారిలో ఉన్న రాళ్లను తొలగించడం కంటే, రాళ్లతో నిండిన దారిలో ఎలా నడవాలో నేర్పడమే నిజమైన పేరెంటింగ్.
"*అతి పర్యవేక్షణ.. ఆత్మవిశ్వాసానికి ఉరితాడు*
కాకూడదనే ఉద్దేశంతో ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను…
*తుఫాను వస్తే లైట్ హౌస్ అక్కడే ఉంటుంది కానీ హెలికాఫ్టర్ ఏ కూలిపోతుందని గుర్తుంచుకోండి*
"మొక్కకు ప్రతిరోజూ నీళ్లు పోయడం అవసరమే.. కానీ అదే నీటిలో మొక్కను ముంచేస్తే అది కుళ్లిపోతుంది. ప్రేమైనా, పర్యవేక్షణ అయినా అంతే!"
జీజాబాయి – ఛత్రపతి శివాజీ మహారాజ్.
జీజాబాయి శివాజీని కట్టడి చేయలేదు
🔹 ధైర్యం, ధర్మం, నాయకత్వం నేర్పింది
🔹 యుద్ధభూమిలో అడుగు పెట్టే ధైర్యాన్ని నింపింది
👉 ఆమె హెలికాప్టర్ కాదు… లైట్‌హౌస్.
ఆమె మార్గం చూపింది… కానీ అడుగులు అతడే వేసాడు.
పుత్లిబాయి గాంధీ – మహాత్మా గాంధీ.
🔹 సత్యం, అహింస విలువలను చిన్నప్పుడే నేర్పింది
🔹 గాంధీ నిర్ణయాల్లో ఆమె జోక్యం లేదు
🔹 విలువలు ఇచ్చింది… జీవితం అతడే నిర్మించుకున్నాడు
👉 విలువలు ఇవ్వండి… నిర్ణయాలు పిల్లలవే అవ్వాలి.
"శివాజీలా నాయకుడు కావాలంటే… జీజాబాయిలాంటి తల్లి కావాలి.
గాంధీలా మహానుభావుడు కావాలంటే… విలువలు ఇచ్చే తల్లిదండ్రులు కావాలి.
పిల్లల రెక్కలు కత్తిరించకండి… ఆకాశం చూపండి."
మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు
Dr.Rambabu Ankam



Comments
Post a Comment